![]() |
![]() |

ఒకవైపు హాస్య ప్రధాన చిత్రాల్లోనూ.. మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటించి అలరించిన వైనం `అల్లరి` నరేశ్ సొంతం. అలాంటి.. నరేశ్ కి మే 10 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం అంటే 2002లో ఇదే రోజున నరేశ్ హీరోగా పరిచయమైన `అల్లరి` జనం ముందు నిలిచింది. ఈ చిత్రంతోనే మల్టిటాలెంటెడ్ రవిబాబు దర్శకుడిగా తొలి అడుగేయడం విశేషం. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నరేశ్ జోడీగా శ్వేత అగర్వాల్, నీలాంబరి నటించగా చలపతి రావు, సుభాషిణి, కోట శ్రీనివాస రావు, అపూర్వ, తనికెళ్ళ భరణి, సుధ, లక్ష్మీపతి, కల్పనా రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రవి (`అల్లరి` నరేశ్), అపర్ణ (శ్వేతా అగర్వాల్), రుచి (నీలాంబరి) మధ్య సాగే ముక్కోణపు ప్రేమకథే.. `అల్లరి` చిత్రం.
పాల్ జే సంగీతమందించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారు. ఇందులోని ``అత్తయ్యో మామయ్యో``, ``రా పోదాం``, ``నర నరం`` తదితర గీతాలన్ని ఆకట్టుకున్నాయి. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు నిర్మించిన `అల్లరి`.. తమిళంలో `కురుంబు` (`అల్లరి` నరేశ్, నికిత, దియా) పేరుతో రీమేక్ కాగా `పంజా` దర్శకుడు విష్ణువర్థన్ ఈ రీమేక్ తోనే కెప్టెన్ గా మొదటి అడుగేశారు. కాగా, 2002 మే 10న విడుదలై విజయం సాధించిన `అల్లరి`.. నేటితో 20 వసంతాలు పూర్తి చేసుకుంది. అలాగే, నటుడిగా నరేశ్ కెరీర్ కి కూడా నేటికి 20 ఏళ్ళు పూర్తయ్యాయి.
![]() |
![]() |